1 Kings 5

1తరవాత, తన తండ్రికి బదులుగా సొలొమోనుకు పట్టాభిషేకం జరిగిందని తూరు రాజు హీరాము విని తన సేవకులను సొలొమోను దగ్గరకి పంపాడు. ఎందుకంటే హీరాము దావీదుకు మంచి స్నేహితుడు. 2అప్పుడు సొలొమోను హీరాముకు ఈ సందేశం పంపించాడు.

3<<యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదాల కింద అణచివేసే వరకూ అన్ని వైపులా అతనికి యుధ్ధాలు ఉన్నాయి.

4తన దేవుడు యెహోవా నామ ఘనతకు అతడు ఒక మందిరం కట్టించడానికి వీలు లేకపోయింది. ఈ సంగతి మీకు తెలుసు. ఇప్పుడైతే శత్రువులెవరూ లేకుండా, ఏ అపాయమూ కలగకుండా నా దేవుడు యెహోవా నలుదిక్కులా శాంతి నెలకొల్పాడు. 5కాబట్టి <నీ సింహాసనం మీద నీకు బదులుగా నేను నిలిపే నీ కొడుకు నా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టిస్తాడు> అని యెహోవా నా తండ్రి దావీదుకు మాట ఇచ్చిన విధంగా నేను నా దేవుడు యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టించడానికి నిర్ణయించాను.

6లెబానోనులో నా కోసం దేవదారు మానులను నరికించడానికి అనుమతి ఇవ్వండి. నా సేవకులు మీ సేవకులతో కలిసి పని చేస్తారు. ఎందుకంటే మానులు నరకడంలో సీదోనీయులకు సాటి మాలో ఎవరూ లేరు అని మీకు తెలుసు గదా.

7మీరు నిర్ణయించిన విధంగా నేను మీ సేవకులకు జీతం ఇస్తాను>> అన్నాడు.

హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని చాలా సంతోషపడి, <<ఇంత గొప్ప జాతిగా విస్తరించిన ప్రజానీకాన్ని పాలించడానికి జ్ఞానవంతుడైన కొడుకుని దావీదుకు దయచేసిన యెహోవాకు ఈ రోజున స్తుతి కలుగుతుంది గాక>>అన్నాడు.
8అతడు సొలొమోనుకు జవాబు పంపుతూ, <<నీవు నాకు పంపిన సందేశాన్ని నేను అంగీకరించాను. దేవదారు, సరళ మానులను గురించి నీవు కోరినట్టే చేయిస్తాను.

9నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రం దగ్గరకి తెస్తారు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు చెప్పిన చోటికి సముద్రం మీద చేరేలా చేసి, అక్కడ వాటిని నీకు అప్పగించే ఏర్పాటు నేను చేస్తాను. నీవు వాటిని తీసుకోవచ్చు. ఇందుకు బదులుగా నీవు నా సేవకుల పోషణ కోసం ఆహారం పంపించు>> అన్నాడు.

10హీరాము సొలొమోను కోరినన్ని దేవదారు, సరళ మానుల్ని పంపించాడు. 11సొలొమోను హీరాముకూ అతని పరివారం పోషణకు 2,00,000 తూముల గోదుమలు, 4,16,350 లీటర్ల స్వచ్ఛమైన నూనె పంపించాడు. ఈ విధంగా సొలొమోను ప్రతి సంవత్సరం హీరాముకు ఇస్తూ వచ్చాడు.

12యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం ప్రకారం అతనికి జ్ఞానం ప్రసాదించాడు. హీరాము, సొలొమోను సంధి చేసుకున్నారు, వారిద్దరి మధ్య శాంతి నెలకొంది.

13సొలొమోను రాజు ఇశ్రాయేలీయులందరి చేతా బలవంతంగా వెట్టి పని చేయించాడు. వారిలో 30,000 మంది వెట్టి చాకిరీ చేసే వారయ్యారు. 14అతడు వంతుల ప్రకారం వీరిని నెలకు 10,000 మందిని లెబానోనుకు పంపించాడు. వారు ఒక నెల లెబానోనులో, రెండు నెలలు ఇంటి దగ్గరా ఉండేవారు. ఆ వెట్టివారి మీద అదోనీరాము అధికారిగా ఉన్నాడు.

15అంతేగాక, సొలొమోనుకి బరువులు మోసేవారు 70,000 మందీ పర్వతాల్లో మానులు నరికే వారు 80,000 మందీ ఉన్నారు.

16వీరంతా కాక సొలొమోను పనివారిపై 3,300 మంది అధికారులు అజమాయిషీ చేస్తుండేవారు.

17రాజు ఆజ్ఞ ప్రకారం వారు మందిర పునాదిని చెక్కిన రాళ్లతో వేయడానికి గొప్పవి, చాలా విలువైనవి అయిన రాళ్ళు గనుల్లో నుండి తవ్వి తెప్పించారు. ఈ విధంగా సొలొమోను పంపిన శిల్పకారులు, గిబ్లీయులు, హీరాము శిల్పకారులు మానులు నరికి రాళ్లను మలిచి మందిరం కట్టడానికి వాటిని సిద్ధపరిచారు.

18

Copyright information for TelULB